దర్శకుడు "డాక్టర్ ప్రభాకర్ జైనీకి తెలంగాణా సినీ స్వర్ణ కమలం అవార్డు ప్రదానం"

దర్శకుడు
దర్శకుడు  "డాక్టర్ ప్రభాకర్ జైనీకి తెలంగాణా సినీ స్వర్ణ కమలం అవార్డు ప్రదానం"


2014 సంవత్సరానికి 'నంది' అవార్డు గ్రహీత, పదిహేను పాపులర్ నవలలు రచించిన ప్రముఖ నవలా రచయిత,
తెలుగు సినిమా రంగంపై 'నవ్య' వారపత్రికలో ముప్ఫై వారాల పాటు 'సినీవాలి' అనే సంచలనాత్మక నవల రాసిన ప్రభాకర్ జైనీ గారికి ఈ నెల 9 న తెలుగు సాహిత్యంలో డాక్టరేట్ బహుకరించబడింది.  
ఆదివారం సాయంత్రం హైదరాబాదు సారథీ స్టూడియోలో బీజేపీ సినిమా సెల్ అధ్వర్యంలో, ప్రముఖ నటుడు సీవీయల్ నర్సింహరావు అధ్యక్షతన జరిగిన అవార్డుల ప్రదాన ఉత్సవంలో బీజేపీ శాసనసభా పక్ష నాయకుడు ఎమ్మెల్యే జీ.  కిషన్ రెడ్డి, యమ్మెల్సీ యన్. రామచంద్ర రావు గారు పాల్గొన్నారు. తెలంగాణా ప్రభుత్వం గత నాలుగేళ్ళుగా 'సింహ' అవార్డులు ప్రకటించక పోవడంతో కళాకారులు నిరాశలో ఉన్నారని అందుకే ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికే ఈ అవార్డులతో పాటు నెలరోజుల్లోనే 'కాకతీయ' ఫిల్మ్ అవార్డులు ప్రకటిస్తామని చెప్పారు. 
తెలుగు సినిమా రంగానికి చేసిన కృషికి గానూ, ముఖ్యంగా 'అంపశయ్య' వంటి సంచలనాత్మక సినిమాను నిర్మించి దర్శకత్వం వహించినందుకు గానూ డా. ప్రభాకర్ జైనీకి "తెలంగాణా సినీ స్వర్ణ కమలం" అవార్డు ప్రదానం చేయబడింది.
గత శతాబ్దంలో వచ్చిన వంద గొప్ప నవలల్లో ఒకటయిన 'అంపశయ్య' వంటి మనోవైఙ్ఞానిక నవలను సినిమాగా తీయడమే సాహసమనీ, అందులోని ఆత్మను ఆవిష్కరించే పటిష్టమైన స్క్రీన్ ప్లేతో సెల్యులాయిడ్ పై అద్భుతమైన సుందర దృశ్య కావ్యాన్ని ఆవిష్కరించిన డా. ప్రభాకర్ జైనీ ఈ సినిమాలో తన భార్య శ్రీమతి విజయలక్ష్మీ జైనీతో కలిసి రెండు పాత్రలను పోషించారు. ఒక చోట వారి నటన ప్రేక్షకుల కంట కన్నీరు పెట్టిస్తుందని సీవీయల్ నర్సింహరావు అన్నారు. 
రెండు సార్లు 'భరతముని సినీ ఆర్ట్స్ అకాడెమీ' అవార్డులు, 2014 సంవత్సరానికి నంది అవార్డు పొందిన డా. ప్రభాకర్ జైనీని 'తెలంగాణా సినీ స్వర్ణ కమలం' అవార్డుతో సత్కరించడం సముచితంగా ఉందని వక్తలు పేర్కొన్నారు.
బహుమతి గ్రహీతలందరికి సంబంధించిన ఆడియో విజువల్ లఘు చిత్రాన్ని ప్రదర్శించడం అందరికీ నచ్చింది. డా. ప్రభాకర్ జైనీతో పాటు గాయని మధుప్రియ, టీవీ, సినీ నటుడు అశోక్ కుమార్, సినీ క్రిటిక్ హెచ్. రమేశ్ బాబు, కాంతారావు కుమారుడు టీ. యల్. రాజా, నటి ఆయేషా జలీల్, డెక్కన్ సినిమా ఆర్కే మామా మొదలైన వారికి ఈ అవార్డులు బహుకరించడం జరిగింది.

Your Comments

Most Read Telugu Movie News

Advertisement